Sunday, March 4, 2018

Brittle Leaves (ఎండు టాకులు)


ఎండు టాకులు
అల్ల
దూరంలో కొన్ని ఎండుటాకుల గుత్తులు
నగ్నపు అక్రోటు, మేపిల్, సింధూర, సీమచింత …
కొమ్మల నుంచి వెళ్ళాడు తున్నాయి
మా పడక గది గాజు కిటికీలోంచి కనిపిస్తాయి
నాకు.
ఎన్నో సార్లు ఆలోచించాను
ఎందుకు, ఇంకా ఇప్పుడు
తల్లి చెట్టుని పట్టుకొని
వెళ్లాడటం, ఎందుకింకా?
ఉపయోగితా మభ్య భరిత
ఆధునిక మానవ దృష్టిలో -
వీటి వల్ల ఏం లాభం?
ఇక్కడ, ఈ హేమంతంలో చలికి
చెట్లు (ఆకులకి) తేమ ద్రవాలు
నిలిపేస్తాయి, అంతే ఓ రాత్రి
వణుకే చలికి ఆకులన్నీ తమ తమ
రంగు రంగుల లోదుస్తులు
చూపిస్తాయి; ఈ దుర్భర చలిలో
ప్రేమతో తల్లికి తోడుంటాయి
పగిలి ఎండిపోయిన బెరుడులతో కప్పిన
చాలీచాలని ఆఛ్చాదము - చాలు
ఈ ఒక్క దృశ్యము, ప్రపంచంలోని
నికృష్ట నిస్సహాయ దారిద్ర్య దష్ట
నగ్న మానవాకృతి కాల బిలం స్ఫురించడానికి
చాలీచాలని ఆఛ్చాదనముతో -
ఈ చెట్లతో ఎవరు మాట్లాడుతారు?
ఇప్పుడు ఎవరు పలకరిస్తారు?
ఈ కాల జలద భరిత శీతల
అతి దారుణ చలిలో ఎవరు చెప్పు?  
కాదు, ప్రకృతి మనమూహించినంత
క్రూరురాలు కాదు
ఇప్పుడూ
ఈ చెట్లకి అతిధులు వస్తారు
(ఆకలితో) లేళ్ళు, బొచ్చు తోకల ఉడుతలు,
నీలి పిట్టలు, చికడీలు (తీతీ పిట్టలు), తొలిచే
వడ్రంగి పిట్టలు,
బొద్దు కాకులు, గువ్వలు, ఒక్కక్కప్పుడు
పెన్నడ పులుగు - కాని ఈ తీవ్ర చలిలో కూడ
ఈ ఎండుటాకులు
చెట్లతో రహస్యాలు మాట్లాడుతాయి!
ముసిముసి గుస గుసలు
చూస్తుంటే ప్రతీ గాలి హృదయ తరంగాలు
ఈ ఆకుల వీవనలకు చెప్తుంటాయి
ఏ సూక్ష్మ గాలి రాకపోకడలైనా సరే  
చెప్పకుండా వీటిని దాటి వెళ్ళ లేవు
అతి సున్నితపు అణు బల ముల్లు లాగ
పనిచేస్తాయి ఈ మేపిల్ ఎండుటాకుల మొనలు
దూరంనుంచి నాకు వినిపించవు
కొన్ని సన్న ధ్వని తరంగాలు,
ఈ పిల్ల గాలుల ఈల పాటలు
కాని (ఈ) ఎండు టాకుల చిన్ని చిన్ని
విసినకఱ్ఱలు, ఆ దిగువున నిరంతర
పారే జలపాతము, మనోజ్ఞ శాంతిలో
ఓలలాడే వనము.. మెరిసే హిమాపు తెరల్లోంచి  
ఇస్తాయి ప్రతి ప్రొద్దు
ఆనందము మాకు; నూత్న కొంగ్రొత్త
అనుభూతుల ఖని ఇది నాకు
ఎండి చచ్చి పోయాయి అనుకొంటాము
ఈ ఆకులు, కాని ఇప్పుడు ఎంతో
జీవముట్టిపడి పలకరిస్తాయి
ఓ రోజు వీటితో గర్భిత ఉడుతలు ఇల్లు
కాదు, గూడు కట్టుకొంటాయి
వీటిలో కాలాతీత ప్రాణము
నా ఊహల కందని జీవము
ఎల్లప్పుడూ అలరారును.   Copyright 2018 by the author

(This was initially posted at Sulekha. At times I wonder whether I still have the same grip on my mother tongue Telugu despite being away from the Telugu land. Originally I wrote the poem in English titled as "Brittle Leaves". In this Telugu translation I tried to bring forth the original emotion, thoughts, and good bit of fidelity. Due to the bitter cold, winter is sometimes harsh; but there is always more meaning and beauty in nature. I have only attempted to catch a minuscule of that enormous splendor!)